కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అనర్హత కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

రెండు నెలల పాటు సింగిల్ జడ్జీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఇవాళ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జీ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను రెండు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

తదుపరి విచారణను 4 వారాల పాటు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. రాష్ర్ట ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.