Asara@Hyderabad

రాజధానిలో కొండంత ఆసరా..

-హైదరాబాద్ జిల్లాలో రెండు లక్షలకు చేరిన లబ్ధిదారులు 
-ప్రతినెల పింఛన్లకు రూ.21.20 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం 
-గతంతో పోల్చితే ఒకటిన్నర రెట్లు పెరిగిన లబ్ధిదారులు.. పది రెట్లు పెరిగిన కేటాయింపులు

ఆసరా పింఛన్లు హైదరాబాద్ జిల్లాలోని నిస్సహాయులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. లబ్ధిదారుల సం ఖ్య రోజురోజుకు పెరుగుతూ రికార్డు స్థాయిలో దాదా పు రెండు లక్షలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 39.43 లక్షల మందికి పింఛన్లు అందిస్తుండగా.. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే రెండు లక్షల మందికి పంపిణీ చేస్తుండటం విశేషం. గత ప్రభుత్వాల హయాంలో కేవలం రూ.200-500 మాత్రమే అందేది. ఈ అరకొర సాయం హైదరాబాద్ జిల్లా లో కేవలం 87వేల మందికి మాత్రమే దక్కేది. తెలంగాణ ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడంతోపాటు అర్హులందరికీ పింఛను ఇస్తుండటంతో ఈ ఏడాది జూలై చివరినాటికి ఆసరా లబ్ధిదారుల సంఖ్య 1.96 లక్షలకు చేరుకున్నది. గతంతో పోల్చి తే ఆర్థిక సహాయం దాదాపు పది రెట్లు పెరిగింది. పింఛన్లకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలో నెలకు రూ.2.17 కోట్లు మాత్రమే పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 21.20 కోట్లు పంపిణీ చేస్తున్నది. మధ్య దళారీలు, అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. పింఛను సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నారు.