మీకు మీ కుటుంబ సభ్యులకు “వైకుంఠ ఏకాదశి” శుభాకాంక్షలు..

 

వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం..

మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.