సమాజంలో నేరప్రవృత్తి పెరుగకుండా నైతికవిలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు.
మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్స్వామిలాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలను ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దొర తన సర్వీస్కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ, ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పుస్తక రచయితను, ప్రచురణకర్తలను సన్మానించారు.